ఆయన వెలిగించిన దీపాలు ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉన్నాయి: మోహన్ బాబు

30-05-2020 Sat 15:49
  • ఇవాళ దర్శకరత్న దాసరి వర్థంతి
  • దాసరి అనేకమందికి జీవితాన్నిచ్చారన్న మోహన్ బాబు
  • అందులో తానూ ఒకడ్నని వెల్లడి
Mohan Babu remembers Dasari Narayanarao

ఇవాళ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఆయన శిష్యుడు మోహన్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. సినీ నటుడిగా తనకు జన్మను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి తన గురువు దాసరి నారాయణరావు అని కీర్తించారు. తన గురువు దాసరి ఎంతోమందికి అవకాశాలు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో దీపాలు వెలిగించారని, ఆ దీపాలు ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నాయని తెలిపారు. అందులో తానూ ఒకడ్నని మోహన్ బాబు వెల్లడించారు.

సినిమాలో ఎన్ని పాత్రలు ఉంటాయో అన్ని పాత్రలూ ఒక్కొక్క సినిమాలో ఒక్కో విధంగా తన కోసం సృష్టించిన గొప్ప వ్యక్తి అని, తన కలం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని కొనియాడారు. తెలుగు చిత్ర సీమలో 24 క్రాఫ్ట్స్ కు దాసరి అండగా నిలిచినట్టుగా మరొకరు నిలవలేరని, అలాంటివాళ్లు ఇక రారు, పుట్టలేరు కూడా అని వ్యాఖ్యానించారు. తన గురువు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు తన కుటుంబానికి ఉంటాయని తెలిపారు.