Chandrababu: వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన పనులు ఇవే!: చంద్రబాబు సెటైర్లు

  • తొలిరోజు నుంచే వైసీపీ పాలకుల అరాచకాలు  
  • ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభం 
  • హామీల అమలులో ఘోరంగా విఫలం 
  • అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారు 
  • పెట్టుబడులు వెనక్కి పోయాయి
chandrababu fires on ap govt

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 'వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6 నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు' అని చెప్పారు.
 
'ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన విధ్వంసాన్ని ఏడాది మొత్తం యథేచ్ఛగా సాగించారు. సమాజానికి చెడు చేసే చర్యలను, ప్రజా వ్యతిరేక పాలనను తెలుగుదేశం సహించదు. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలం అయ్యారు. అవివేక నిర్ణయాలతో నమ్మిన ప్రజలనే నట్టేట ముంచారు' అని విమర్శించారు.

'రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు, భవన నిర్మాణ కార్మికులు, యువత... ఇలా అన్నివర్గాల ప్రజలను రోడ్డెక్కించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది కుటుంబాలు 164 రోజులుగా అమరావతి పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం' అని చంద్రబాబు చెప్పారు. 
 
'ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత...ఇన్ని విషాదాల్లో వైసీపీ ఏడాది పాలన ఉత్సవాలా..? ఏం సాధించారని...? ఎవరికేం ఒరగబెట్టారని..?  ఇకనైనా బాధ్యతగా పనిచేయండి' అని చంద్రబాబు అన్నారు.

More Telugu News