చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల కీలక భేటీ.. బాలయ్య వివాదంపై చర్చ?

29-05-2020 Fri 12:38
  • సినీ పరిశ్రమలో బయటపడుతున్న విభేదాలు
  • తలసానితో కలసి భూములు పంచుకుంటున్నారేమో అన్న బాలయ్య
  • బాలయ్య క్షమాపణలు చెప్పాలన్న నాగబాబు
Tollywood big heads meets in Chiranjeevi house

కరోనా దెబ్బకు తెలుగు సినీ పరిశ్రమలోని విభేదాలు రచ్చకెక్కాయి. లాక్ డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన షూటింగులను పునఃప్రారంభించే విషయమై మంత్రి  తలసానితో సినీ పెద్దలు భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశానికి తనను పిలవలేదని... అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారేమోనని బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై నాగబాబు స్పందిస్తూ బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంతో... సినీ పరిశ్రమలో ఐక్యత లేదనే విషయం మరోసారి స్పష్టమైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఈరోజు చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు మరోసారి సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు, సినీ కార్మికులకు రెండో విడత సాయంపై చర్చించనున్నారని చెబుతున్నప్పటికీ... ప్రధానంగా బాలయ్య వివాదంపైనే చర్చ జరగబోతోందని సమాచారం. సమావేశానంతరం మీడియాతో చిరంజీవి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం భేటీకి తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, సి.కల్యాణ్, బెనర్జీ తదితరులు హాజరయ్యారు. మరికొందరు కూడా వచ్చే అవకాశం ఉంది.