ఈ క్షణం నుంచే మళ్లీ రమేశ్‌ కుమార్‌ ఏపీ ఎన్నికల కమిషనర్.. కనగరాజ్‌ ఇక ఉండరు‌: న్యాయవాదుల స్పష్టీకరణ

29-05-2020 Fri 12:05
  • ఆర్డినెన్స్‌ రద్దయిన నేపథ్యంలో నిమ్మగడ్డ ఏపీ ఈసీగా ఉన్నట్లే
  • ఇకనైనా జగన్ తన‌ తీరును మార్చుకోవాలి
  • ఏపీ ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలి
  • రమేశ్ కుమార్ కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా హైకోర్టు తీర్పు  
lawyers on ap high court verdict

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు విషయంలో నిబంధనలు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను  హైకోర్టు కొట్టేసిన విషయంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరఫున వాదించిన పలువురు న్యాయవాదులు స్పందించారు. ఈ క్షణం నుంచే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని చెప్పారు. ఎన్నికల అధికారిగా ఇకపై కనగరాజ్‌ కొనసాగడానికి వీల్లేదని వారు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ రద్దయిన నేపథ్యంలో నిమ్మగడ్డ ఏపీ ఎన్నికల కమిషనర్‌గా ఉన్నట్లేనని ఆయన చెప్పారు.

 ఇకనైనా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవాలని న్యాయవాది ప్రసాద్ బాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం ఒక్క ఏడాదిలోనే ఇన్ని విమర్శలు ఎదురవుతున్నాయని, ఇకపై ఆయినా తీరు మార్చుకుని తదుపరి నాలుగేళ్లు సమర్థవంతంగా పాలన అందించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ వ్యవహారాలకు సంబంధించి ఇదో చారిత్రక తీర్పని న్యాయవాదులు అంటున్నారు. రమేశ్ కుమార్ కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా హైకోర్టు తీర్పు ఇచ్చిందని వివరించారు.