హైకోర్టు మెట్లెక్కిన డాక్టర్ సుధాకర్.. ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి

29-05-2020 Fri 09:44
  • ఈ నెల 16 నుంచి నన్ను నిర్బంధించారు
  • మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని ఆరోపణ
  • ఒకటి రెండు రోజుల్లో విచారణ ప్రారంభించనున్న విశాఖ సీబీఐ
Doctor Sudhakar files petition on High court

నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా తనను ఈ నెల 16 నుంచి విశాఖపట్టణంలోని మానసిక వైద్యశాలలో నిర్బంధించారని ఆరోపించారు.

తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మానసిక రోగులకు ఇచ్చే మందులు బలవంతంగా ఇస్తున్నారని, వాటి వల్ల తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స కోసం తనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, హైకోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరారు. నేడు విచారణకు వచ్చే అవకాశం ఉన్న ఈ వ్యాజ్యంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య అరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా చేర్చారు.

మరోవైపు డాక్టర్ సుధాకర్ కేసును విచారించే బాధ్యతను విశాఖ సీబీఐకి అప్పగిస్తూ సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో విశాఖ అధికారులు ఒకటి రెండు రోజుల్లో కేసు విచారణను చేపట్టనున్నట్టు తెలుస్తోంది.