Donald Trump: భారత్‌-చైనా ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడాను: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

PM Modi not in good mood over border row
  • మధ్యవర్తిగా ఉండేందుకు నేను సిద్ధం
  • మోదీ అంటే నాకు చాలా ఇష్టం
  • చైనాతో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల  మోదీ అసంతృప్తి
  • ఇరు దేశాలకు చాలా శక్తిమంతమైన సైనిక శక్తి ఉంది
భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పారు. అంతేగాక, తాను ఇప్పటికే ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన గొప్ప వ్యక్తి అని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చైనాతో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల  మోదీ అసంతృప్తితో ఉన్నారని అన్నారు.

'ఈ రెండు దేశాల మధ్య పెద్ద వివాదం ఉంది. భారత్, చైనాలో 1.4 బిలియన్ల చొప్పున జనాభా ఉంది. ఇరు దేశాలకు చాలా శక్తిమంతమైన సైనిక శక్తి ఉంది. ఈ వివాదం పట్ల భారత్‌, చైనా అసంతృప్తితో ఉన్నాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను భారత్‌, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ బుధవారం కూడా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఆఫర్‌ను ఇప్పటికే భారత్‌ సున్నితంగా తిరస్కరించింది. అయితే, మరోసారి ట్రంప్ అదే ఆఫర్ చేయడం గమనార్హం.

కాగా, లడఖ్ సరిహద్దులోని పాంగాంగ్‌, గాల్వన్‌ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంట చైనా తన బలగాల్ని మోహరిస్తూ, పలు నిర్మాణాలు చేపడుతుండడంతో భారత్‌ కూడా అందుకు దీటుగా ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచుకుంటోంది. దీంతో చైనా బలగాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో భారత సైన్యం కూడా అదే రీతిలో ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం ఇస్తోంది. దీంతో  2017లో డోక్లాం తరహా ప్రతిష్టంభన చోటు చేసుకుంటుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
Donald Trump
america
Narendra Modi
India

More Telugu News