కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

28-05-2020 Thu 20:27
  • ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన చిన్న కోడలు
  • ఆసుపత్రికి తరలించేలోగా మృతి
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
Kanna Lakshminarayana daughter in law commits suicide

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో చనిపోయారు. అందుతున్న వివరాల ప్రకారం హైదరాబాద్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్ లోని స్నేహితురాలి నివాసంలో ఈ సాయంత్రం ఆమె స్పృహ తప్పి పడిపోయారని చెపుతున్నారు. మరోవైపు ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఘటన జరిగిన వెంటనే ఆమెను రాయదుర్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వెల్లడించారు.

అయితే, ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.