AP High Court: హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై కేసు నమోదు

  • 49 మందిలో ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు
  • మిగతా వారిపై కొనసాగుతున్న విచారణ
  • నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష
CID files cases against 7 persons

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యంతరకర, అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన 49 మందిలో ఏడుగురిపై సీఐడీ అధికారులు నిన్న కేసులు నమోదు చేశారు.

తమ ఎదుట హాజరుకావాలంటూ నిందితుల్లో పలువురికి సీఆర్‌పీసీ 41ఎ కింద నోటీసులు జారీ చేశారు. న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యానించిన 49 మందిని గుర్తించి ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేయగా, తాజాగా వారిలో ఏడుగురిపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. మిగతా వారికి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు.

కేసులు నమోదైన వారిలో దరిశ కిశోర్‌రెడ్డి, లింగారెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, చందురెడ్డి, శ్రీనాథ్ సుస్వరం ఉన్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

More Telugu News