లక్నో ఇరుకు వీధుల్లో అమితాబ్... ఎవరూ గుర్తుపట్టలేదట!

28-05-2020 Thu 08:52
  • చిన్న చిన్న వీధుల్లో 'గులాబో సితాబో' షూటింగ్
  • గుబురు గడ్డంతో వృద్ధుడిగా కనిపించనున్న అమితాబ్
  • ఎవరూ గుర్తించలేదని చెప్పిన దర్శకుడు సూజిత్
Lucknow People Didnot Recognise Amitab

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లక్నోలోని ఇరుకు వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పటికీ, ఎవరూ గుర్తు పట్టలేదట. ఈ విషయాన్ని 'గులాబో సితాబో' దర్శకుడు సూజిత్ సర్కార్ వెల్లడించారు. ఈ సినిమాలో అమితాబ్ గుబురు గడ్డంతో కనిపించనుండగా, షూటింగ్ సహజంగా రావాలన్న ఆలోచనతో లక్నోలోని హజరత్ గంజ్, చౌక్ వీధుల్లో షూటింగ్ చేశారు. అది కూడా చాలా తక్కువ మందితోనే పని పూర్తి చేశారు.

ఇక షూటింగ్ ముగియగానే, అమితాబ్, తాను వేసుకున్న గెటప్ తోనే కాసేపు అలా చక్కర్లు కొట్టి వచ్చేవారట. అక్కడ ఉండే స్థానికులతో మాట్లాడుతూ ఉన్నా, ఆయన ఎవరన్న విషయాన్ని మాత్రం ఎవరూ గుర్తించలేదట. ఆ వీధుల్లోనే కూర్చుంటూ, అక్కడే తింటున్నా ఎవరూ పట్టించుకోలేదని సూజిత్ చెప్పుకొచ్చారు. కాగా, లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడిన వేళ, ఓటీటీ ప్లాట్ ఫామ్ మాధ్యమంగా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేనెల 12న ఈ సినిమా విడుదల కానుంది.