Mamata Banerjee: వద్దని చెప్పినా రైళ్లు పంపిస్తున్నారు.. మహారాష్ట్ర నుంచి బెంగాల్ కు కరోనాను విస్తరింపజేస్తున్నారు: మమతాబెనర్జీ ఫైర్

  • వివిధ ప్రాంతాల నుంచి బెంగాల్ కు 225 రైళ్లు
  • ఇంత మందికి స్క్రీనింగ్ పరీక్షలు ఎలా నిర్వహించాలన్న మమత
  • కరోనాతో పోరాడాలా? లేక తుపానుతో పోరాడాలా? అంటూ మండిపాటు
From Maharashtra Railways Spreading Corona To Bengal says Mamata Banerjee

ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను బెంగాల్ కు పంపిస్తున్నారంటూ రైల్వే మంత్రిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వలస కార్మికులను పంపిస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రను ఖాళీ చేయిస్తూ, అక్కడి నుంచి బెంగాల్ కు కరోనాను విస్తరిస్తున్నారని... తద్వారా రెండు రాష్ట్రాలతో రాజకీయ క్రీడ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 225 రైళ్లు బెంగాల్ కు రానున్నాయి. వీటిలో 41 రైళ్లు మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. ఇప్పటికే 19 రైళ్లు బెంగాల్ కు చేరుకున్నాయి. అనేక రైళ్లు మార్గమధ్యంలో ఉన్నాయి. ఈ రైళ్లన్నీ రాష్ట్రానికి చేరుకుంటే... కరనా వైరస్ విస్తరణ కట్టలు తెంచుకుంటుందని మమత అన్నారు.

రైల్వే మంత్రి ఇలా ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని మమత అన్నారు. 2 లక్షల మంది వలస కార్మికులకు తాము స్క్రీనింగ్ పరీక్షలు ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం సహకరిస్తుందా? అని అడిగారు. అన్ని విషయాలను రాజకీయాలు అధిగమిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. తాను తుపానుతో పోరాడాలా? లేక కరోనాతో పోరాడాలా? అని ప్రశ్నించారు. వలస కార్మికులు తిరిగి వచ్చేందుకు తాము ఒక షెడ్యూల్ ఇచ్చామని... కానీ, 36 రైళ్లు బయల్దేరుతున్నాయని నిన్న సడన్ గా సమాచారం ఇచ్చారని మండిపడ్డారు.

రైళ్లలో సామాజికదూరానికి సంబంధించి రైల్వే చర్యలు తీసుకోలేదని మమత ఆరోపించారు. టికెట్లకు డబ్బులు తాము చెల్లిస్తున్నప్పుడు... బోగీల్లో అంత మంది ప్రయాణికులను ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. తనను బీజేపీ రాజకీయంగా దెబ్బతీయవచ్చని... కానీ, రాష్ట్రానికి ఎందుకు హాని చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News