హిందీ టీవీ నటి ప్రేక్ష మెహతా ఆత్మహత్య

26-05-2020 Tue 20:10
  • ఇండోర్ లోని తన నివాసంలో ఆత్మహత్య
  • ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న ప్రేక్ష
  • డిప్రెషన్ కారణమై ఉంటుందని అనుమానం
Actress Preksha Suicide

హిందీ టీవీ నటి, హోస్ట్ ప్రేక్ష మెహతా (25) ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. నిన్న రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఈ రోజు ఉదయం ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధిని కోల్పోవడంతో డిప్రెషన్ కు లోనై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. చనిపోవడానికి ముందు ఆమె ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. కన్న కలలు చనిపోయినప్పుడు... జీవితం చెత్తగా ఉంటుందని ఇన్స్టాలో వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఉరి వేసుకుంది.

ఈ ఉదయం ఫ్యాన్ కు వేలాడుతున్న ప్రేక్షను చూసి ఆమె తండ్రి షాక్ కు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తును ప్రారంభించారు. మరణానికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.

క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ వంటి పలు టీవీ షోలతో పాటు... అక్షయ్ కుమార్ చిత్రం 'ప్యాడ్ మేన్'లో కూడా ఆమె నటించింది. ఆమె మృతి పట్ల పలువురు నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.