కరోనా వైరస్ సాధారణమైనది... దాన్ని మించిన జేజెమ్మలు ఉన్నాయి: చైనా 'బ్యాట్ ఉమన్' వెల్లడి

26-05-2020 Tue 14:23
  • ఆసక్తికర విషయాలు వెల్లడించిన వుహాన్ ల్యాబ్ పరిశోధకురాలు
  • కొన్నేళ్లుగా గబ్బిలాలపై పరిశోధనలు సాగిస్తున్న షి జెంగ్లీ
  • కొన్ని మృత్యు వైరస్ లతో పోల్చితే కరోనా సాధారణమైందని వెల్లడి
China Bat Woman says corona just a tip of the ice berg

ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి జన్మస్థానం వుహాన్ అని తెలిసిందే. అక్కడి ప్రఖ్యాత వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ వైరస్ బయటికి వ్యాపించిందన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఆ ఆరోపణలను వుహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.

తాజాగా దీనిపై చైనాలో బ్యాట్ ఉమన్ గా ప్రసిద్ధి చెందిన షి జెంగ్లీ స్పందించారు. షి జెంగ్లీ గత కొన్నేళ్లుగా ప్రమాదకర వైరస్ లపై పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా, గబ్బిలాలే అత్యంత ప్రమాదకర వైరస్ లకు వాహకాలుగా వ్యవహరిస్తున్నాయని గుర్తించి, ఆ దిశగానూ అధ్యయనం చేస్తున్నారు. దాంతో ఆమెకు 'బ్యాట్ ఉమన్' గా పేరొచ్చింది. జెంగ్లీ వుహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక, తాజాగా ఆమె మాట్లాడుతూ, అందరూ కరోనా ఎంతో ప్రమాదకరం అని భావిస్తున్నా, వాస్తవానికి దాన్ని మించిన మృత్యుకారక వైరస్ లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నో గుర్తుతెలియని ప్రాణాంతక వైరస్ మహమ్మారులు పొంచి ఉన్నాయని, వాటితో పోల్చితే కరోనా వైరస్ చాలా సాధారణమైందిగా భావించాలని పేర్కొన్నారు. తాము వైరస్ లపై నిరంతరం అధ్యయనం చేయకపోతే, మరో మహమ్మారి వైరస్ విరుచుకుపడే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

మానవాళిని అత్యంత ప్రమాదకర వైరస్ ల నుంచి కాపాడాలంటే ఈ గుర్తు తెలియని వైరస్ లపై మరింతగా అధ్యయనం చేయకతప్పదని అన్నారు.  ప్రస్తుతం తాను పరిశోధన సాగిస్తున్న అనేక వైరస్ లు, కరోనా వైరస్ జెనెటిక్స్ తో ఏమాత్రం సరిపోలనివి అని, అవి పూర్తిగా సరికొత్తవని వెల్లడించారు. అయితే, ఇటీవల కాలంలో సైన్స్ రంగంపై రాజకీయ నీడలు పరుచుకోవడం బాధాకరమైన విషయం అని విచారం వ్యక్తం చేశారు.