క్వారంటైన్‌లో ఉన్న భర్త గదికి తాళం వేసి.. ప్రియుడితో వెళ్లిపోయిన భార్య

26-05-2020 Tue 13:10
  • మధ్యప్రదేశ్‌లో ఘటన
  • ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చిన భర్త
  • పిల్లలను కూడా వదిలేసి ప్రియుడితో వెళ్లిన మహిళ
wife jump

ఇతర ప్రాంతం నుంచి వచ్చిన భర్త ఓ గదిలో క్వారంటైన్‌లో ఉంటున్నాడు. అయితే, ఆ గది తలుపులకు బయటి నుంచి తాళం వేసిన భార్య ప్రియుడితో పారిపోయింది. బయటి నుంచి తాళం వేసి ఉన్న విషయాన్ని గుర్తించిన భర్త ఇతరుల సాయంతో బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ జిల్లాలో ముందేరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో భవన నిర్మాణ రంగంలో ఓ వ్యక్తి కూలీగా పని చేస్తున్నాడు. అతడి భార్యాపిల్లలు ఇన్నాళ్లు ఢిల్లీలోనే ఉండి,  ఏడాదిన్నర క్రితం సొంత గ్రామం ముందేరికి వచ్చి అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

మరోపక్క, లాక్‌డౌన్‌ కారణంగా ఆమె భర్త కూడా ఇటీవల సొంతూరికి వచ్చాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆ వ్యక్తి తన ఇంట్లోని పై అంతస్తులో 14 రోజుల క్వారంటైన్‌లో ఉంంటున్నాడు. భార్యాపిల్లలు మాత్రం కింది‌ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే, తన భర్త ఇంటికి రావడంతో తన ప్రియుడిని ఇక కలవలేనేమోనని భయపడిన ఆమె.. భర్తను గదిలోనే ఉంచి తాళం వేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.