Quarantine Centre: అమ్మ కోసం ఉద్యోగం వదిలేసి దుబాయి నుంచి వచ్చేశాడు.. చివరికి కడసారి చూపూ దక్కలేదు!

Son Arrived In India To Meet Mother She Died While He Was In Quarantine
  • ఇంటికి రావాలని రెండు నెలలుగా ప్రయత్నాలు
  • మే 13న ఢిల్లీ చేరుకున్న ఆమిర్ ఖాన్‌
  • అనారోగ్యంతో తల్లి మృతి
  • క్వారంటైన్‌లో ఉండడంతో చూసుకోలేపోయిన కుమారుడు
అనారోగ్యంతో వున్న తల్లిని ఇక దగ్గరుండి చూసుకోవాలని భావించి, ఉద్యోగానికి రాజీనామా చేసి దుబాయి నుంచి భారత్‌కు వచ్చాడు ఓ యువకుడు. అయితే, కరోనా విజృంభణ వల్ల అతడిని భారత్‌లో అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. ఇంతలో అతడి తల్లి మృతి చెందింది. ఆమెను కడసారి కూడా చూసుకోలేకపోయాడు.

ఈ విషాదకర సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమిర్ ఖాన్ దుబాయిలో ఆరేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. అతడి తల్లి ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో ఉంటుంది. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఇకపై ఆమెను దగ్గరుండి చూసుకోవాలని ఆమె కుమారుడు ఆమిర్ ఖాన్ నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఇటీవలే ఉద్యోగాన్ని వదిలేసి దుబాయి నుంచి ఢిల్లీ చేరుకున్నాడు. అయితే, కరోనా కట్టడి కోసం విధించిన క్వారంటైన్‌ నిబంధనల వల్ల ఢిల్లీలోనే 14 రోజులు ఉండాల్సి ఉంది. ఇక త్వరలోనే ఆయన ఇంటికి వెళ్తాడనగా.. తన తల్లి చనిపోయిందన్న విషాద వార్త ఆయనకు అందింది. దీంతో తాను ఇంటికి వెళ్తానని అడిగాడు.

అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో అతను అక్కడి నుంచి కదలలేకపోయాడు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని పంపిస్తామని అధికారులు చెప్పారని, తాను కరోనా పరీక్ష చేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అయినప్పటికీ తన తల్లిని కడసారి చూసుకునేందుకు పరిస్థితులు కలిసి రాలేదని ఆయన చెప్పాడు.

తన తల్లి గత ఏడాది నవంబరు నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, భారత్‌కు వచ్చేయాలని ఈ ఏడాది మార్చి నుంచి తాను ప్రయత్నాలు జరుపుతున్నానని తెలిపాడు. తన తల్లిని చూసుకుంటూ ఇక్కడే ఉండాలనుకున్నానని చెప్పాడు. రెండు నెలలుగా తాను తన తల్లి వద్దకు వచ్చేయాలన్న ప్రయత్నాల్లోనే ఉన్నానని వివరించాడు.

చివరకు మే 13న యూఏఈ నుంచి భారత్‌కు చేరుకున్నానని తెలిపాడు. ఓ ప్రైవేటు హోటల్‌లో తాను 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నానని చెప్పాడు. క్వారంటైన్‌లో ఎనిమిది రోజులు గడవగానే తన తల్లిని ఓ సారి చూస్తానని అధికారులకు చెప్పానని, అయితే, అందుకోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారని తెలిపాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే తన తల్లి చనిపోయినట్లు వార్త అందిందని, దీంతో కడసారి చూపునకు వెళ్తానని చెప్పినప్పటికీ అనుమతులు లభించలేదని రోదిస్తూ తెలిపాడు.
Quarantine Centre
Lockdown
Corona Virus
India

More Telugu News