రాజమహేంద్రవరం టు యూపీ.. మూడుచక్రాల సైకిల్‌పై దివ్యాంగుడి పయనం!

26-05-2020 Tue 10:24
  • రాజమండ్రిలో అత్తర్లు అమ్ముకుంటూ జీవిస్తున్న రాంసింగ్
  • ఆయనతో పాటు వచ్చిన వారందరూ కాలినడకన సొంత రాష్ట్రానికి
  • నిన్న ఉదయం అనకాపల్లి చేరిక
Man travelling to UP from Rajamahendravaram by tricycle

లాక్‌డౌన్ కష్టాలు ప్రజలు, వలస కార్మికులను నానా అగచాట్లకు గురిచేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన చాలామంది వలస కార్మికులు ఎర్రని ఎండలో నడుచుకుంటూనే స్వగ్రామాలకు పయనం కాగా, మిగతా వారు వివిధ మార్గాల ద్వారా స్వరాష్ట్రాలకు చేరుకుంటున్నారు. వలస కూలీల్లో ఇంకా చాలామంది నడక కొనసాగిస్తూనే ఉన్నారు.

తాజాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అత్తర్లు అమ్ముకుంటూ జీవనం సాగించే యూపీకి చెందిన దివ్యాంగుడు రాంసింగ్ కూడా స్వగ్రామం బాటపట్టాడు. తనకున్న మూడుచక్రాల సైకిలుపై రాజమహేంద్రవరం నుంచి మూడు రోజుల క్రితం యూపీకి బయలుదేరాడు. అలా సైకిలు తొక్కుకుంటూ నిన్న ఉదయానికి విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లి చేరుకున్నాడు. తనతో పాటు వచ్చిన ఐదుగురూ నడుచుకుంటూ వెళ్లిపోయారని, తాను ఈ సైకిలుపై వెళ్తున్నట్టు చెప్పాడు. విషయం తెలిసిన స్థానిక వైద్యుడొకరు రాంసింగ్‌కు ఆర్థిక సాయం చేసి పంపించారు.