గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం: సీఎం జగన్

25-05-2020 Mon 14:25
  • పాదయాత్రలో ప్రజల కష్టాలు గమనించానన్న సీఎం
  • సుపరిపాలన కోసం 'గ్రామసచివాలయం' తీసుకువచ్చినట్టు వెల్లడి
  • ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యలు
CM Jagan tells about village secretariat system

సుమారు 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర సాగిన తన పాదయాత్రలో ప్రజల కష్టాలు గమనించానని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకువచ్చామని, ఆ వ్యవస్థే... గ్రామ సచివాలయ వ్యవస్థ అని తెలిపారు.

 గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటివద్దకే సేవలు అందేలా చేశామని చెప్పారు. అంతేగాకుండా, సంవత్సర కాలంలోనే గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని వివరించారు.

గ్రామ సచివాలయ వ్యవస్థలో అవినీతి లేదని, ఇది ఎంతో పారదర్శకమైన వ్యవస్థ అని తెలిపిన సీఎం జగన్, గ్రామ సచివాలయ వ్యవస్థపై ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇళ్లవద్దకే అవ్వాతాతలకు పెన్షన్లు అందిస్తున్నామని, వైఎస్సార్ బీమా, వాహనమిత్ర, మత్స్యకార భరోసా పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. వలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారానే కరోనా నియంత్రణ చర్యలు చేపట్టామని, సమగ్ర కుటుంబ సర్వేలు నిర్వహించామని వివరించారు.