వీర్యంలోనూ తిష్టవేస్తున్న కరోనా వైరస్.. అధ్యయనంలో వెల్లడి

25-05-2020 Mon 08:21
  • చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
  • ఇమ్యునోప్రివిలైజ్డ్ సైట్స్‌లో దాగి ఉండే వైరస్
  • కరోనా నుంచి కోలుకున్నా మూడేళ్లపాటు వృషణాల్లో దాగి ఉండే అవకాశం
Coronavirus can live in Sperm for Three years

కరోనా వైరస్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెల్లడైంది. ఈ వైరస్ పురుషుల వీర్యంలోనూ తిష్ట వేస్తున్నట్టు చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. చైనాలోని హెనన్ ప్రావిన్స్‌లోని షాంఘ్‌క్యూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 38 మంది కరోనా రోగుల వీర్యాన్ని పరీక్షించిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.

కేంద్ర నాడీవ్యవస్థలోని ‘ఇమ్యునోప్రివిలైజ్డ్ సైట్స్’గా అభివర్ణించే వృషణాలు, కళ్లు, పిండం భాగాల్లోకి చేరిన వైరస్ శరీర రక్షణ వ్యవస్థ దాడి నుంచి తట్టుకుని జీవించగలదని పేర్కొన్నారు. అంతేకాదు, కరోనా వైరస్ బారినపడి కోలుకున్న మూడేళ్ల వరకు కూడా ఆయా భాగాల్లో వైరస్ జీవించి ఉండే అవకాశం ఉందన్నారు. లైంగిక చర్య ద్వారా వైరస్ అక్కడి నుంచి భాగస్వామికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.