Warangal Rural District: వీడిన వరంగల్ హత్యకేసుల మిస్టరీ.. అల్లుడే సూత్రధారి!

  • పథకం ప్రకారం హత్య చేయించిన అల్లుడు
  • పార్టీ మధ్యలో వచ్చిన వ్యక్తి కూడా హత్య
  • నేడు మీడియా ముందుకు నిందితులు
Mystery of the Warangal murder case solved

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్, గొర్రెకుంట హత్యకేసుల మిస్టరీ వీడింది. అల్లుడే పథకం ప్రకారం 9 మందిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. బీహార్ యువకులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. గొర్రెకుంట ఘటనలో మొత్తం 9 మంది హత్యకు గురయ్యారు. బాధిత మక్సూద్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే 20 మంది బీహార్ వాసులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మక్సూద్, అతడి కుమార్తె ఫోన్‌కాల్ డేటాను సేకరించిన పోలీసులు నిందితుల్లో ఒకడు వారితో ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడినట్టు, వాట్సాప్ చాటింగ్ చేసినట్టు గుర్తించారు. అలాగే, నిందితుల్లో ఒకడైన సంజయ్ కుమార్‌తో మక్సూద్ కుమార్తెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తేల్చారు. మక్సూద్ భార్య, అతడి కుమార్తెకు సంజయ్ కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. అయితే, తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వకపోవడంతో వారిపై కక్ష పెంచుకున్నాడు.

మరోవైపు, మక్సూద్ కుటుంబం నివసించే గోదాం పై గదిలో నివసించే  శ్యాం, శ్రీరాంలతో మక్సూద్‌ భార్య, కూతురు సన్నిహితంగా ఉండటాన్ని సంజయ్ కుమార్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో వారిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు మక్సూద్ పెద్ద కుమారుడు షాబాజ్ బర్త్ డే పార్టీని తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.  

నిద్రమాత్రల కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేసి పేరు తెలుసుకున్న సంజయ్ కుమార్ షాబాజ్ పుట్టిన రోజు వేడుకకు ముందే వాటిని సంపాదించాడు. గత బుధవారం జరిగిన బర్త్ డే వేడుక సందర్భంగా మరో మిత్రుడి సాయంతో కూల్‌డ్రింకులో మత్తుమందు కలిపి అందరికీ ఇచ్చాడు. అందరూ మత్తులోకి జారుకున్న తర్వాత ఒక్కొక్కరినీ గోనె సంచుల్లో కుక్కి బావి వద్దకు ఈడ్చుకెళ్లి పడేశాడు. పార్టీ మధ్యలో వచ్చిన షకీల్ కూడా కూల్‌డ్రింక్ తాగి మత్తులోకి జారుకోవడంతో అతడిని కూడా గోనె సంచిలో కుక్కి బతికుండగానే బావిలో పడేశాడు.  

శనివారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులకు ఈ మొత్తం ఘటనలో మక్సూద్ అల్లుడు ఖతూరే అసలు పాత్రధారి అని తేలింది. ఖతూర్ ఆదేశాలతోనే ఈ హత్యలకు ప్లాన్ చేసినట్టు నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో కరీమాబాద్‌కు చెందిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

More Telugu News