జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో ఏదో జరుగుతోందని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి

24-05-2020 Sun 19:08
  • ఏపీలో దుమారం రేపుతున్న టీటీడీ ఆస్తుల వేలం
  • చంద్రబాబు హయాంలోనే ఆస్తుల వేలానికి కమిటీ వేశారన్న వెల్లంపల్లి
  • చీకటి జీవోలు ఇచ్చే అలవాటు తమకు లేదని వెల్లడి
Vellampalli refutes TDP allegations over TTD assets

టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారం తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య అగ్గి రాజేసింది. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబులా చీకటి జీవోలు ఇచ్చే ఆలోచన తమకు లేదని అన్నారు. చంద్రబాబులా సదావర్తి భూములు దొంగచాటుగా వేలం వేయాలని నిర్ణయించలేదని ఎద్దేవా చేశారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో ఏదో జరుగుతోందని టీడీపీ, వారి అనుకూల మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో టీటీడీ చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి ఉన్న సమయంలో టీటీడీలో ఉపయోగంలో లేని భూములను వేలం వేసేందుకు కమిటీ వేశారని, గతంలోనే 50 రకాల ఆస్తులను అమ్మాలని గుర్తించారని, బాబు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం వారి అనుకూల మీడియాకు కనిపించలేదా అని ప్రశ్నించారు.