Gujarath: ఇది ఆసుపత్రా లేక మృత్యు నిలయమా?: గుజరాత్ హైకోర్టు విస్మయం

  • అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రిపై హైకోర్టు వ్యాఖ్యలు
  • ఇప్పటివరకు ఈ ప్రభుత్వాసుపత్రిలో 350 మంది కరోనాతో మృతి
  • పేదలు విధిలేక వస్తున్నారన్న హైకోర్టు
High Court terms Ahmedabad government hospital a dungeon

గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం పదుల సంఖ్యలో కరోనా రోగులు మృత్యువాత పడుతుండడం పట్ల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది ఆసుపత్రా లేక మృత్యు నిలయమా? అని విస్మయం వ్యక్తం చేసింది. అహ్మదాబాద్ లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా పేరుగాంచింది. అయితే, ఇప్పటివరకు అక్కడ 350 మందికి పైగా కరోనా కారణంగా చనిపోయారు. పేదవాళ్లు, నిస్సహాయులు విధిలేక ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారని, కానీ మానవ ప్రాణం ఎంతో విలువైనదని, దాన్ని వృథాగా పోనివ్వరాదని కోర్టు వ్యాఖ్యానించింది.

"ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది రోగులకు చికిత్స అందించేందుకేనని మేం గతంలో చెప్పాం. ఇప్పుడు చూస్తుంటే ఎంచక్కా ఓ మృత్యునిలయంలా కనిపిస్తోంది. మృత్యునిలయం కన్నా దారుణంగా ఉందంటే సరిపోతుందేమో. కానీ పేదసాదలకు ఇది తప్ప మరో మార్గం లేదు" అని హైకోర్టు పేర్కొంది. "గత ఎనిమిది వారాలుగా ఈ ఆసుపత్రి నుంచే అత్యధిక మరణాలు వస్తున్నట్టుంది. నాలుగు రోజుల చికిత్స తర్వాత కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమైన అంశం" అని తెలిపింది. గుజరాత్ లో ఇప్పటివరకు 13 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 829 మంది మరణించారు.

More Telugu News