Mamata Banerjee: 'నా తల నరుక్కుని తీసుకెళ్లండి'... కోల్ కతా నిరసనలపై మమతా బెనర్జీ ఆగ్రహం!

  • తుఫానుతో రాష్ట్రం అతలాకుతలం
  • విద్యుత్, ఇతర సౌకర్యాల కోసం రోడ్డెక్కిన ప్రజలు
  • ప్రభుత్వానికి మరింత సమయం కావాలన్న మమత
Mamata Shouts Cut off My Head over Kolkata Protests

ఎమ్ పాన్ తుఫాను పశ్చిమ బెంగాల్ ను అతలాకుతలం చేసిన తరువాత, వీధినపడ్డ కోల్ కతా వాసులు నిరసనలకు దిగుతున్న వేళ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరమంతా విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించి, నిత్యావసరాలను అందరికీ అందుబాటులోకి తీసుకుని రావడానికి మరింత సమయం పడుతుందని, మౌలిక వసతులు, పంటలకు వాటిల్లిన నష్టం సుమారు లక్ష కోట్ల రూపాయల వరకూ ఉందని వ్యాఖ్యానించిన ఆమె, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

"విపత్తు సంభవించి రెండు రోజులే అయింది. మేమంతా రేయింబవళ్లూ శ్రమిస్తున్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. సాధ్యమైనంత త్వరగా పరిస్థితులు చక్కబడతాయి" అని మీడియాతో వ్యాఖ్యానించారు. నిరసనలు చేస్తూ, రోడ్డెక్కిన నగర వాసుల గురించి ప్రస్తావన రాగా, "నేను ఒక్కటే చెప్పగలను. నా తల నరుక్కుని తీసుకెళ్లండి" అని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సహాయక చర్యల కోసం ఆర్మీని కూడా పిలిపించామని తెలిపారు.

కాగా, తుఫాను తరువాత ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదంటూ, శనివారం నాడు వేలాది సంఖ్యలో నగర పౌరులు నిరసనల బాట పట్టారు. బారక్ పూర్ - సోడేపూర్ బైపాస్ రోడ్డులో పోలీసులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. దక్షిణ కోల్ కతాలోని కస్బా, గారియా ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించిన ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. తమకు వెంటనే విద్యుత్ ఇవ్వాలంటూ కోనా ఎక్స్ ప్రెస్ వేపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.

More Telugu News