TG Venkatesh: శ్రీవారి ఆస్తులు వేలం వేయడం కుదరదు.. కోర్టు ఆదేశాలు ఉన్నాయి: టీజీ వెంకటేశ్

  • ఆస్తుల వేలానికి వెళ్తే.. మళ్లీ కోర్టులకు వెళ్లొచ్చు
  • కోర్టుల చుట్టూ తిరిగే పనిని ఆపేయండి
  • 203 జీవోను తెలంగాణ నేతలు వ్యతిరేకించడం సరికాదు
TTD land sale is not possible says TG Venkatesh

శ్రీవారి ఆస్తులను వేలం వేయడానికి టీటీడీ పాలక మండలి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేవాలయ ఆస్తులను వేలం వేయడం కుదిరే పని కాదని అన్నారు. ఈ మేరకు కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ వేలం వేసేందుకు ముందుకు వెళ్తే, మళ్లీ కోర్టులను ఆశ్రయించవచ్చని అన్నారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరిగే పనిని ప్రభుత్వం మానేయాలని, ప్రజల కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని... వాటిపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై కూడా టీజీ స్పందించారు. ఈ జీవోను తెలంగాణ నేతలు వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. పోతిరెడ్డిపాడు వల్ల ఎవరికీ నష్టం లేదని... అలాంటప్పుడు దాన్ని అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు. రాయలసీమకు మంచి చేసే వాటిని అడ్డుకుంటున్నారని... మన ప్రయోజనాలకు కర్ణాటక గండి కొట్టినా పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News