కరోనా కంటే కేసీఆర్ కు కూతురు కవితే ముఖ్యమయ్యారు: రేవంత్ రెడ్డి, షబ్బీర్

22-05-2020 Fri 16:58
  • నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎస్ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
  • కూతురి కోసం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణ
  • ఎంపీ ఎన్నికల్లో ఓడిన కవితకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నారని వెల్లడి
Telangana Congress leaders slams CM KCR

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ వర్గాలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఎంపీ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత షబ్బీర్ అలీ తమ ఫిర్యాదులో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

ఎంపీ ఎన్నికల్లో ఓడిన కవితకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నారని, కూతురు కోసం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కరోనా కంటే కేసీఆర్ కు కవితే ముఖ్యమయ్యారని వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.