చంద్రబాబు ఇప్పుడు కూడా నీచ రాజకీయాలే చేస్తున్నారు: లక్ష్మీపార్వతి

22-05-2020 Fri 16:13
  • చంద్రబాబును జనాలు ఎప్పుడో మర్చిపోయారు
  • బాబు జూమ్ నాయకుడు అయ్యారు
  • ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టరా?
Chandrababu bain not grown says Lakshmi Parvathi

ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సేవలు అవసరం లేదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని చెప్పారు. దుర్బుద్ధి వల్లే చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... ప్రతి అంశాన్ని రాజకీయాలకు అనుగుణంగా మలుచుకునేందుకు యత్నిస్తారని విమర్శించారు. డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ కూడా చంద్రబాబు రాజకీయాలకు బలవుతున్నారని చెప్పారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నీచ రాజకీయాలే చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు.

జూమ్ ద్వారా మీటింగులు పెట్టుకుంటూ జూమ్ నాయకుడిగా ఎదిగిపోయారని అన్నారు. పాలనాకాలంలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదని... ఏడాదిలోనే 90 శాతం హామీలను జగన్ పూర్తి చేశారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ఒక తండ్రిలా జగన్ సేవ చేస్తున్నాడని అన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పారు.

డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ ఇద్దరూ టీడీపీ సానుభూతిపరులని లక్ష్మీపార్వతి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం సుధాకర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారని చెప్పారు. టీడీపీకి అనుకూలంగా రంగనాయకమ్మ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. 66 ఏళ్ల మహిళపై కేసులు పెట్టారంటూ టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని... గతంలో తనపై చేసిన తప్పుడు ప్రచారం వారికి గుర్తులేదా? అని మండిపడ్డారు.