Plane Crash: పాకిస్థాన్ లో విమాన ప్రమాదం... 99 మంది దుర్మరణం?

  • కరాచీ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిన విమానం
  • ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా ప్రమాదం
  • ప్రమాద వేళ విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది
Plane crashes near Karachi airport in Pakistan

పాకిస్థాన్ లో విమాన ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కి చెందిన ప్రయాణికుల విమానం కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 4 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలింది. ఈ ఎయిర్ బస్ ఏ-320 విమానంలో ప్రమాదం జరిగిన సమయంలో 99 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిలో ఎవరూ బతికే అవకాశాలు లేవని తెలుస్తోంది. లాహోర్ నుంచి వచ్చిన ఈ విమానంలో 91 మంది ప్రయాణికులు కాగా, 8 మంది విమాన సిబ్బంది.

ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా, విమానం ఒక్కసారిగా అదుపుతప్పి విమానాశ్రయం సమీపంలోని జిన్నా గార్డెన్ ఏరియాలో కూలిపోయింది. ఘటనపై సమాచారం అందుకున్న పాక్ క్విక్ రియాక్షన్ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలకు ఉపక్రమించాయి. కాగా, ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. విమానం నివాస గృహాలపై కూలిపోవడంతో స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించి ఉంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

More Telugu News