Dead Bodies: వరంగల్ శివారు బావిలో మరో ఐదు మృతదేహాలు లభ్యం

  • పాడుపడిన బావిలో శవాలుగా తేలిన వలస కుటుంబం
  • నిన్న నాలుగు మృతదేహాలు వెలికితీత
  • 9 మంది మరణంపై పలు సందేహాలు
Five more dead bodies found in Warangal

వరంగల్ శివారు ప్రాంతమైన గీసుకొండలోని ఓ పాడుపడిన బావిలో ఓ వలస కార్మికుల కుటుంబం శవాలుగా తేలిన వైనం సంచలనం సృష్టించింది. నిన్న నాలుగు మృతదేహాలు లభ్యం కాగా, నేడు మరో ఐదు మృతదేహాలను వెలికితీశారు. దాంతో బావి నుంచి మొత్తం 9 మృతదేహాలు బయటపడ్డాయి. నిన్న మక్సూద్, అతని భార్య నిషా, కుమార్తె బుస్రా, మనవడి మృతదేహాలను గుర్తించిన పోలీసులు, ఇవాళ మక్సూద్ కుమారులు షాబాద్, సొహైల్ లతో పాటు వరంగల్ కు చెందిన షకీల్, బీహార్ కార్మికులు శ్యామ్, శ్రీరామ్ ల మృతదేహాలను సైతం అదే బావి నుంచి వెలికితీశారు.

ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ మృతదేహాలపై గాయాలు లేకపోవడంతో వారు ఎలా చనిపోయారన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మక్సూద్ కుటుంబం రెండు దశాబ్దాల కిందట బెంగాల్ నుంచి వరంగల్ కు వలస వచ్చింది. మక్సూద్ కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె బుస్రాకు పెళ్లి కాగా, భర్త నుంచి విడిపోయి కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కాగా, మక్సూద్ కుటుంబం లాక్ డౌన్ నేపథ్యంలో తాము పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రంలోనే నివాసం ఉంటున్నారు. ఇదే ప్రాంగణంలో కొందరు బీహార్ యువకులు కూడా ఉంటున్నారు.

గురువారం మధ్యాహ్నం గోనె సంచుల తయారీ కేంద్రం యజమాని సంతోష్ వచ్చేసరికి ఎవరూ కనిపించకపోవడంతో, పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే పక్కనే ఉన్న పాత బావిలో చూడగా, నాలుగు మృతదేహాలు కనిపించాయి. దాంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. నిన్న సాయంత్రం నుంచి మృతదేహాల వెలికితీత కొనసాగుతుండగా, తాజాగా మరో ఐదు మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సేకరించిన ఆధారాల పరిశీలనలో పోలీసు శాఖ తీవ్రంగా నిమగ్నమైంది.

More Telugu News