JC Diwakar Reddy: కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు పట్టించుకోవడం లేదు!: జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు

  • రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోంది
  • జగన్ కు అందరూ భయపడుతున్నారు 
  • నిరాహార దీక్ష చేసినా జనాలు నమ్మే స్థితిలో లేరు
  • పోతిరెడ్డిపాడు విషయంలో సిన్సియర్ గానే ఉన్నట్టున్నాడు 
JC Diwakar Reddy fires on Jagan

ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి మిమర్శలు గుప్పించారు. 'మా వాడు' అంటూనే తనదైన శైలిలో టార్గెట్ చేశారు. జగన్ తప్పులు చేస్తున్నారని... రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని అన్నారు. అమరావతి రాజధాని కోసం 158 రోజులుగా రైతులు, మహిళలు దీక్ష చేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని... మీ సమస్య ఏమిటి అని కూడా అడగలేదని చెప్పారు. జిందాబాదులకు, ముర్దాబాదులకు జగన్ మాట వినడని అన్నారు. కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా మా వాడు పట్టించుకోవడం లేదని... హైకోర్టునే పీకేశాడని చెప్పారు. జగన్ ను చూసిన అందరూ వణుకుతారని చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ చెప్పిందే జరుగుతోందని... టీడీపీ వాళ్లపై దాడులు జరుగుతున్నాయని... రాక్షస రాజ్యంలో ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలమని జేసీ దుయ్యబట్టారు. టీడీపీ వాళ్లు ఎందుకు దీక్షలు చేస్తున్నారో తనకు అర్థం కాదని అన్నారు. దీక్షలు చేసినంత మాత్రాన జగన్ లో మార్పు రాదని చెప్పారు. నిరాహార దీక్ష చేసినా జనాలు నమ్మే స్థితిలో లేరని... బిర్యానీ తిని దీక్షలో కూర్చున్నారని అనుకుంటారని తెలిపారు. రాష్ట్రంలోని సగం జనాలు ఆయన ఇంటి ముందు కూర్చుంటే జగన్ వింటాడేమో అని చెప్పారు.

నీళ్ల  విషయంలో అన్నదమ్ములు కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారని... ఒకరి తల మరొకరు నరికేందుకు సిద్ధమవుతారని జేసీ అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ సిన్సియర్ గానే ఉన్నట్టు కనిపిస్తోందని చెప్పారు.

More Telugu News