Cyclone Amphan: తీరాన్ని తాకిన ఎమ్‌ఫాన్.. అల్లకల్లోలంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలు

  • నాలుగు గంటలపాటు కొనసాగనున్న తీరం దాటే ప్రక్రియ
  • ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల నుంచి 4.5 లక్షల మంది తరలింపు
  • గంటకు 165 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు
Cyclone Amphan Landfall Started

అతి తీవ్ర తుపాను ఎమ్‌ఫాన్ ఈ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే ప్రక్రియ నాలుగు గంటలపాటు ఉంటుందని, అనంతరం బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ వద్ద తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లో గంటకు 165 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలోని దాదాపు 4.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

మరోవైపు, తుపాను ప్రభావంతో బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రంలో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అలలు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్రా తెలిపారు.

ముందుజాగ్రత్త చర్యగా కోల్‌కతా విమానాశ్రయాన్ని రేపు సాయంత్రం వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను తీరం దాటాక గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అది బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారి, ఆ తర్వాత బలహీనపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

More Telugu News