ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు!: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం

20-05-2020 Wed 14:07
  • పీపీఈ కిట్లు ఇవ్వాలని అడిగితే డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్ చేశారు
  • రంగనాయకమ్మ  పోస్టులు పెడితే నోటీసులు పంపారు
  • విద్యుత్ ఛార్జీలు పెంచి కరెంటే వాడుకోకుండా చేస్తున్నారు 
  • అసత్యాలు చెప్పడంలో సీఎం జనగ్ సిద్ధహస్తులు
chandrababu fires on ap govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. తమను ప్రశ్నించిన వారందరినీ ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. మీడియాపై ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీడియా ప్రభుత్వ తీరును తెలిపితే ఎల్లో మీడియా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల ముందు ఉపాధ్యాయులను పెట్టి, ఆ వృత్తిని అపహాస్యం చేశారని చెప్పారు.

పీపీఈ కిట్లు ఇవ్వాలని అడిగితే డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్ చేశారని చంద్రబాబు అన్నారు. సుధాకర్‌ను తాగుబోతు అని అన్నారని, మానసిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేశారని చెప్పారు. సుధాకర్ విషయంలో తమపై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రంగనాయకమ్మ అనే వృద్ధురాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నోటీసులు పంపారని గుర్తు చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

కరెంటు బిల్లులను దారుణంగా పెంచేశారు..
'గుంటూరు సంపత్‌ నగర్‌ గుడిసెలో ఉండే ఓ వ్యక్తికి రెండు నెలల్లో రూ.3000 బిల్లు వచ్చింది. పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచి కరెంటే వాడుకోకుండా చేస్తున్నారు' అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

'విద్యుత్ ఛార్జీలు పెంచలేదని బుకాయిస్తూ శ్లాబ్‌లు మార్చి భారం మోపడం పెద్ద మోసం. మోసం చేసినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రజలను మభ్యపెట్టేలా సీఎం జగన్‌ పలు ప్రకటనలు చేస్తున్నారు. అసత్యాలు చెప్పడంలో సీఎం జగన్ సిద్ధహస్తులు' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'అధికారంలోకి వస్తూనే పీపీఏలపై పడ్డారు. విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయడం వల్ల పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ రాకుండా చేశారు. విద్యుత్‌ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చాం. వేలల్లో వస్తోన్న విద్యుత్‌ బిల్లులను చూసి ప్రజలు షాక్ అవుతున్నారు' అని చంద్రబాబు అన్నారు.

'ఫ్యాన్‌కి ఓటేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వారంతా ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితికి వచ్చారు. మరోవైపు, దాతలు ఇచ్చిన భూములను, ప్రభుత్వ భూములను అమ్ముతున్నారు. ప్రజల ఆస్తులను విక్రయించే హక్కు ఎవరు ఇచ్చారు? మేము సలహాలు, సూచనలు ఇస్తే ఉన్మాదుల మాదిరిగా మారి ఎదురుదాడి చేస్తున్నారు' అని చంద్రబాబు విమర్శించారు.

ప్రజల తరఫున తాము పోరాడతామని చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలను తగ్గిస్తూ రాష్ట్రంలో మూడు నెలల పాటు కరెంట్‌ బిల్లులు రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.