లాక్ డౌన్ తరువాత తొలి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు... కొరడా ఝళిపించిన హైదరాబాదు పోలీసులు!

20-05-2020 Wed 07:39
  • నిన్నటి నుంచి భారీ సడలింపులు
  • ఆటో డ్రైవర్ కు 187 బీఏసీ కౌంట్
  • మాస్క్ లు ధరించని 395 మందిపై జరిమానా
Hyderabad Police First Drunk and Driving Test After Lockdown

లాక్ డౌన్ ప్రారంభం అయిన తరువాత హైదరాబాదు నగరంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ఆపేసిన పోలీసులు, మద్యం విక్రయాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, ఇంతవరకూ వాటిని నిర్వహించలేదు. సాయంత్రం 6 గంటలకు మద్యం షాపులను మూసి వేస్తుండటం, 7 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుండటమే దీనికి కారణం. ఇక నిన్నటి నుంచి భారీ స్థాయిలో లాక్ డౌన్ సడలింపులు అమలులోకి రావడంతో అనుమానితులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

దీంతో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టిన ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా, 187 బీఏసీ కౌంట్ వచ్చింది. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, మాస్క్ లు లేకుండా బయటకు వచ్చిన వారిపైనా పోలీసులు కొరడా ఝళిపించారు. మాస్క్ లేనివారిపై రూ. 1000 జరిమానా విధిస్తున్నామని, మంగళవారం నాడు జంట నగరాల పరిధిలో 395 మందిపై జరిమానా విధించామని అధికారులు తెలిపారు.