కరోనాను నాశనం చేయడానికి వేసవి ఎండలు సరిపోవంటున్న పరిశోధకులు!

18-05-2020 Mon 18:54
  • వేడిమితో కరోనా వ్యాప్తి కొద్దిమేర తగ్గుతుందని వెల్లడి
  • ప్రత్యుత్పత్తి నిదానిస్తుందని వివరణ
  • ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసిన అమెరికా పరిశోధకులు
Researchers says summer heatwave can not impact corona

సాధారణంగా కొన్ని వైరస్ లు అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేవు. అవి చల్లని వాతావరణంలోనే ప్రభావం చూపిస్తుంటాయి. కానీ, ఇప్పుడు ప్రపంచ మానవాళిని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ను వేసవిలో భగభగ మండే ఎండలు కూడా ఏమీ చేయలేవని హార్వర్డ్ మెడికల్ స్కూలు, మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులంటున్నారు. అధిక వేడిమితో కరోనా క్రిములు పూర్తిగా నాశనం అవుతాయని చాలామంది అభిప్రాయపడినా, అందులో వాస్తవం లేదని ఓ అధ్యయనంలో తేలింది.

అయితే, సగటు ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ కంటే మించితే కరోనా వైరస్ వ్యాప్తి కాస్త నిదానిస్తుందని, అక్కడి నుంచి ప్రతి 1.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలతో కరోనా సూక్ష్మజీవుల ప్రత్యుత్పత్తి కూడా తగ్గుముఖం పడుతుందని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 3,739 ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, కరోనా వ్యాప్తి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. కొన్ని ఆసియా దేశాల నగరాల్లో వేసవి కారణంగా మే, జూన్ మాసాల్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతాయని, జూలైలో మళ్లీ కాస్త పెరుగుతాయని వివరించారు.