New York Times: కరోనా సంక్షోభం నేపథ్యంలో మరింత పెరిగిన మోదీ ప్రాభవం... న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం

  • అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీకి గుర్తింపు
  • తాజా పోల్ లో 90 శాతం మంది మోదీకే మద్దతు
  • కర్తవ్య ప్రబోధకుడిగా అభివర్ణించిన న్యూయార్క్ టైమ్స్
New York Times terms PM Modi a Mobiliser

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకుల్లో ఒకరిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలోనూ మోదీ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదని, ప్రజలు ఆయన నాయకత్వంపై విశేషంగా నమ్మకం ఉంచుతున్నారని అమెరికాలో ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ఈ మేరకు ఓ కథనాన్ని వెలువరించింది. అత్యధికులు మోదీ నాయకత్వాన్నే బలపరుస్తున్నారని తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తే దాదాపు 90 శాతం మంది మోదీ నిర్ణయాలకే మద్దతు పలుకుతున్న విషయం తేలిందని న్యూయార్క్ టైమ్స్ వివరించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ల కంటే మోదీ ప్రజాదరణ అమోఘమైన రీతిలో పైకెగబాకుతోందని వెల్లడించింది. 2019లో మోదీ తిరిగి ఎన్నికయ్యాక పుల్వామా దాడి ఘటన ఆయన్ను బలమైన నేతగా నిలిపితే, తాజా కరోనా సంక్షోభం మరింత దృఢమైన నాయకుడిగా ఆవిష్కరించిందని ఆ కథనంలో పేర్కొన్నారు.

అయితే ఎంత ప్రజాదరణ ఉన్నా ఎప్పుడూ నియంతగా వ్యవహరించలేదని, ఓ కర్తవ్య ప్రబోధకుడిగానే ఉన్నారని కొనియాడారు. అందుకే ఆయన ఒక్క పిలుపు ఇవ్వగానే దేశం మొత్తం మరో మాటకు తావులేకుండా పాటిస్తున్నారని, జనతా కర్ఫ్యూ పాటిద్దాం అనగానే, భారత ప్రజలు అక్షరాలా కర్ఫ్యూ పాటించి చూపారని న్యూయార్క్ టైమ్స్ వివరించింది.

More Telugu News