Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు సిబ్బంది మందుపార్టీ.. ఓ ఉద్యోగి మృతితో కలకలం

Employees in Gandhi Hospital enjoy with Liquor party
  • సెల్లార్‌లో అర్ధరాత్రి వరకు మందుపార్టీ
  • ఉదయం ఇంటికెళ్లాక కుప్పకూలి మరణించిన ఓ ఉద్యోగి
  • విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేసిన సూపరింటెండెంట్
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కొందరు కాంట్రాక్టు సిబ్బంది మద్యం పార్టీ చేసుకున్నారు. ఆసుపత్రి సెల్లారులో పూటుగా మద్యం తాగి నానా యాగీ చేశారు. అనంతరం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి మరణించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శ్రీనివాస్, నరేశ్, నగేశ్‌లు సోదరులు. కాంట్రాక్టు పద్ధతిలో ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. గత రాత్రి వీరు మరో ఇద్దరితో కలిసి ఆసుపత్రి సెల్లారులో మందు పార్టీ చేసుకున్నారు. తెచ్చుకున్న మద్యం అయిపోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగితో ఫుల్ బాటిల్ తెప్పించుకుని తాగారు. అనంతరం తెల్లవారుజామున ఇళ్లకు వెళ్లారు.

ఇంటికి వెళ్లిన కాసేపటికే శ్రీనివాస్ (38) కుప్పకూలి మరణించాడు. అయితే, అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు భావించారు. మరోవైపు, ఆసుపత్రి సెల్లార్‌లో మద్యం పార్టీ చేసుకున్న విషయం, శ్రీనివాస్ మృతి చెందిన విషయం అధికారులకు తెలియడంతో వెంటనే విచారణకు ఆదేశించారు. పార్టీ విషయాన్ని తేల్చేందుకు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపడతామని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు.
Gandhi Hospital
Secunderabad
Liquor party

More Telugu News