Ventilator: అవసరాలకు తగిన వెంటిలేటర్ తయారీలో తెలుగోడి ప్రతిభ!

  • సరికొత్త వెంటిలేటర్ రూపొందించిన జార్జియా టెక్ పరిశోధ
  • పరిశోధనలో పాలుపంచుకున్న గోకుల్ పత్తికొండ
  • గోకుల్ స్వస్థలం చిత్తూరు
Telugu youth makes efficient ventilator with his team

కరోనా రోగులకు చికిత్సలో వెంటిలేటర్లు కీలకంగా మారాయి. కరోనా రక్కసి విజృంభిస్తోన్న ఈ తరుణంలో అన్నిదేశాలు వెంటిలేటర్లు సమకూర్చుకోవడానికి విశేష ప్రాధాన్యం ఇస్తున్నాయి. తాజాగా, ఏపీకి చెందిన ఓ యువ ప్రతిభాశాలి ప్రభావవంతంగా పనిచేసే వెంటిలేటర్ తయారీలో పాలుపంచుకున్నాడు. చిత్తూరుకు చెందిన గోకుల్ పత్తికొండ అమెరికాలోని జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో వరంగల్ ఎన్ఐటీ నుంచి పట్టా అందుకున్నారు.

కరోనా నేపథ్యంలో జార్జియా వర్సిటీ వెంటిలేటర్ల తయారీకి ఉపక్రమించగా, ఎంతో సులువుగా, అందుబాటులో ఉండే విడిభాగాలతో చవకైన రీతిలో గోకుల్ వెంటిలేటర్ తయారుచేశారు. ఈ ప్రాజెక్టు నెలరోజుల లోపే పూర్తయింది. తాము ప్రాజెక్టు మొదలుపెట్టే సమయానికి అమెరికాలో పరిస్థితి దారుణంగా ఉందని, భారత ఉపఖండం, ఆఫ్రికా దేశాల్లో అప్పటికి పెద్దగా ప్రభావంలేదని గోకుల్ వెల్లడించారు. ఒకవేళ ఇతర దేశాల్లో కూడా పరిస్థితి దిగజారిన పక్షంలో అక్కడివాళ్లకు ఉపయుక్తంగా ఉండేలా వెంటిలేటర్లకు రూపకల్పన చేశామని వివరించారు.

ఈ వెంటిలేటర్ కు ఓపెన్ ఎయిర్ వెంట్ జీటీ అని నామకరణం చేశారు. ఈ వెంటిలేటర్ పై భారత్ లోని అనేక సంస్థల దృష్టి పడింది. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. దీని ధర 300 డాలర్లు మాత్రమే. అయితే తాము నాణ్యతలో ఎక్కడా రాజీపడలేదని, డాక్టర్ల సూచనలకు అనుగుణంగా ఉంటుందని, భద్రతే ప్రధానంగా తయారుచేశామని గోకుల్ వివరించారు.

ఇక, ఈ ఓపెన్ ఎయిర్ వెంట్ జీటీ వెంటిలేటర్ ప్రత్యేకతల విషయానికొస్తే, దీంట్లో ఓ కంప్యూటర్ కూడా ఉంటుంది. రోగి పీల్చి వదిలే గాలి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటుంది. ఎంతమొత్తంలో గాలి పీల్చుతున్నాడన్నది కూడా లెక్కిస్తుంది. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులు బిగుసుకుపోతాయని, అలాంటి పరిస్థితుల్లో ఊపిరితిత్తుల పనితీరును కూడా దీని ద్వారా అంచనా వేయొచ్చని గోకుల్ తెలిపారు. ఇందులో మరో కొత్త ఫీచర్ ఏంటంటే... రోగి సహజసిద్ధంగా శ్వాస తీసుకునేలా వీలు కల్పిస్తుంది. కోరుకున్నప్పుడు మాత్రమే శ్వాస అందించే వెసులుబాటు కూడా దీంట్లో ఉంది.

అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే, రోగి ఊపిరితిత్తులపై అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, వెంటిలేటర్ లోని అలారం వ్యవస్థ వెంటనే సదరు డాక్టర్ కు హెచ్చరికలు పంపిస్తుందని గోకుల్ వెల్లడించారు. ఈ ఓపెన్ ఎయిర్ వెంట్ జీటీ వెంటిలేటర్ లోని అన్ని విడిభాగాలు ఎక్కడైనా సులభంగా దొరుకుతాయని, అందువల్ల వీటి మెయింటెనెన్స్ కూడా సులువేనని ఈ ఏపీ పరిశోధకుడు వివరించారు.

More Telugu News