ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ముప్పు... పొంచి ఉన్న బ్యాంకింగ్ వైరస్!

15-05-2020 Fri 14:46
  • దాడికి సిద్ధంగా ఉన్న ఈవెంట్ బాట్
  • థర్డ్ పార్టీ యాప్స్ తో ముప్పు తప్పదన్న సెర్ట్
  • ఫోన్ హ్యాకర్ల అధీనంలోకి వెళుతుందని వెల్లడించిన నిపుణులు
CERT warns new virus called Event Bot ready to attack

టెక్నాలజీ వినియోగంతో పాటు అనేక ప్రమాదకరమైన సమస్యలు కూడా పొంచి ఉంటాయి. హ్యాకింగ్, వైరస్ లు, మాల్వేర్లు, స్పై వేర్లు... ఇలా నెట్టింట అనేక సమస్యలు కాచుకుని ఉంటాయి. తాజాగా, ఆండ్రాయిడ్ యూజర్లపై దాడికి సరికొత్త వైరస్ సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్) అనే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ఇది బ్యాంకింగ్ వైరస్ అని, దీనిపేరు ఈవెంట్ బాట్ అని, ఇది ట్రోజన్ తరహా వైరస్ అని వివరించింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న బ్యాంకింగ్ యాప్స్, ఇతర ఆర్థిక సంబంధ యాప్స్ నుంచి కీలక సమాచారాన్ని తస్కరిస్తుందని సెర్ట్ పేర్కొంది.

ఈ ట్రోజన్ తరహా వైరస్ ఒక్కసారి స్మార్ట్ ఫోన్ లో ప్రవేశించాక ఫోన్ ను మొత్తం తన నియంత్రణలోకి తీసుకుంటుందని, పిన్ నెంబర్లను కూడా తెలుసుకుంటుందని సెర్ట్ నిఫుణులు తెలిపారు. ఈవెంట్ బాట్ ప్రధానంగా 200 వరకు యాప్స్ ను లక్ష్యంగా చేసుకుని విజృంభించే అవకాశాలున్నాయని, బ్యాంకింగ్ యాప్ లు, మనీ ట్రాన్స్ ఫర్ యాప్ లు, క్రిప్టోకరెన్సీ వాలెట్లు, ఇతర ఫైనాన్షియల్ యాప్ ల నుంచి సమాచారం చోరీ చేసే అవకాశాలున్నాయని వెల్లడించారు.

అయితే, వాటిలో చాలా యాప్ లు అమెరికా, యూరప్ దేశాలు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని అందువల్ల భారత్ లో ప్రమాదం తక్కువేనని భావిస్తున్నా, ఇక్కడి స్మార్ట్ ఫోన్ యూజర్లకు సంబంధించి కొన్నిసేవలకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉందని సెర్ట్ హెచ్చరిస్తోంది. ఈవెంట్ బాట్ వైరస్ అనేక ఒరిజినల్ యాప్స్ ఐకాన్లను పోలిన నకిలీ యాప్ ల సాయంతో ఫోన్లలో చొరబడుతుందని, స్క్రీన్ లాక్ నుంచి పిన్ నంబర్ల వరకు మొత్తం దీని అధీనంలోకి వెళ్లిపోతుందని తెలిపారు. అందుకే ఆండ్రాయిడ్ యూజర్లు పొరబాటున కూడా థర్డ్ పార్టీ యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకోవద్దని, విశ్వసనీయత లేని వెబ్ సైట్ల నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవద్దని సెర్ట్ స్పష్టం చేసింది.