TV Shootings: టీవీ సీరియల్స్ షూటింగ్స్ తిరిగి ప్రారంభించడానికి రెడీ... ఫెడరేషన్ షరతులు ఇవిగో!

  • జూన్ చివరి వారంలో ప్రారంభంకానున్న షూటింగ్స్
  • కరోనా సోకి మరణిస్తే, రూ. 50 లక్షల పరిహారం
  • సగం మందితోనే షూటింగ్స్
  • వెల్లడించిన ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్‌సీ అధ్యక్షుడు
New Conditions for TV Shootings

లాక్ డౌన్ కారణంగా సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్స్ కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో మహిళలు అభిమానించే సీరియల్స్ మధ్యలోనే ఆగిపోయాయి. టీవీ రియాల్టీ షోల షూటింగ్ జరుగకపోవడంతో, చానల్స్ అన్నీ, పాత షోలను తిరిగి ప్రసారం చేసుకునే పనిలో ఉన్నాయి. ఇక జూన్ చివరి వారంలో అయినా షూటింగ్ లను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న ఫెడ‌రేష‌న్ ఆఫ్ వెస్ట్ర‌న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ విభాగం, కొన్ని ముసాయిదా నిబంధనలను తెరపైకి తెచ్చింది.

ఈ వివరాలను సంఘం అధ్య‌క్షుడు బిఎన్ ‌తివారీ మీడియాకు వెల్లడించారు. వీటన్నింటికీ నిర్మాతలు అంగీకరిస్తే, పరిమిత సిబ్బందితో షూటింగ్ ను తిరిగి ప్రారంభించుకోవచ్చని ఆయన అన్నారు. ముఖానికి మాస్క్, శానిటైజర్  తప్పనిసరని, ప్రతి సెట్లోనూ ఓ పరిశీలకుడు ఉంటాడని, కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారా? లేదా అన్న విషయాన్ని పర్యవేక్షిస్తుంటారని ప్రతిపాదించారు.

ఇక కరోనా సోకి ఎవరైనా ఆర్టిస్ట్ చనిపోతే అతని కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని, వ్యాధి చికిత్సకు అయ్యే వ్యయాన్ని భరించాలని, షూటింగ్ లో ప్రమాదం జరిగి మరణించినా రూ. 50 లక్షలు చెల్లించాలని వెల్లడించారు. పరిహారం కారణంగా కార్మికుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, కుటుంబానికి భరోసా కలుగుతుందన్న ధైర్యం వారిలో ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇక షూటింగ్ స్పాట్ లో ఉండే సిబ్బంది సంఖ్యను సగానికి తగ్గించాలని, ఇదే సమయంలో మిగతా వారి ఉపాధి పోకుండా, రెండు షిఫ్ట్ లలో పని చేసుకోవాలని సూచించారు. 50 సంవత్సరాలు దాటిన వారు మరో మూడు నెలల పాటు షూటింగ్ కు దూరంగా ఉండాలని కూడా ప్రతిపాదించారు. ఇక ఓ అంబులెన్స్ ను ఎప్పుడూ సెట్లో ఉంచాలని చెబుతూ, ఎఫ్‌డ‌బ్ల్యూఐఎస్‌సీ మార్గదర్శకాలను విడుదల చేసిన తివారీ పరిస్థితులను సమీక్షించి, తదుపరి దశలో నిబంధనలను మారుస్తామని పేర్కొన్నారు.

More Telugu News