KCR: హైదరాబాద్ లో మరింత కఠినంగా నిబంధనలు... రేపు తేల్చనున్న కేసీఆర్!

  • గ్రేటర్ పరిధిలో రోజురోజుకూ  విస్తరిస్తున్న కరోనా
  • కొత్త కేసుల్లో 90 శాతానికి పైగా ఇక్కడే
  • రేపు ఉదయం కరోనాపై సమీక్షించనున్న కేసీఆర్
KCR Review Meeting on Corona Tomorrow

గడచిన వారం రోజుల్లో తెలంగాణ జిల్లాల పరిధిలో కొత్తగా కరోనా కేసులు నమోదు కానప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వస్తున్న కేసుల్లో 90 శాతానికి పైగా హైదరాబాద్ పరిధిలోనే వస్తుండటంతో, లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. కరోనా పరిస్థితులను సమీక్షించేందుకు 15వ తేదీన సమావేశమవుతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్న కేసీఆర్, కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఈ నెల 29 వరకూ లాక్ డౌన్ అమలులో ఉండనుంది. తాజా పరిణామాలను చర్చించనున్న కేసీఆర్, దానిని యథాతథంగా అమలు చేసేందుకే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఆర్టీసీ సేవల పునరుద్ధరణ తదితర అంశాలపైనా ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చించనున్నారని సమాచారం.

ఇక ఇదే సమయంలో మధ్యాహ్నం తరువాత సమగ్ర వ్యవసాయ విధానంపైనా కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, మండల వ్యవసాయ అధికారులతో పాటు రైతు బంధు సమితి ప్రతినిధులు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వం చెప్పిన పంటనే వేయాలని స్పష్టం చేసిన నేపథ్యంలో, క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

More Telugu News