Hyderabad: హైదరాబాద్‌లోని ఏపీ వాసులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు రెడీ.. కానీ ఓ షరతు!

APSRTC Buses ready to take migrants who stranded in Hyderabad
  • ఏసీ, నాన్ ఏసీ బస్సులు సిద్ధం చేస్తున్న ఆర్టీసీ
  • హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో 13 వేల మంది దరఖాస్తు
  • క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే టికెట్
లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ బస్సుల్లో ప్రయాణించాలంటే తొలుత స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఓ షరతు కూడా ఉంది. స్వగ్రామానికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ కేంద్రానికి వెళ్లేందుకు అంగీకరించిన వారికే టికెట్లు జారీ చేస్తారు.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చిక్కుకుపోయిన దాదాపు 13 వేల మంది తాము స్వగ్రామాలకు వెళ్లిపోతామని స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో హైదరాబాద్ పరిధిలో 8 వేల మంది, రంగారెడ్డి జిల్లా పరిధిలో 5 వేల మంది ఉన్నారు. వీరిని తరలించేందుకు ఏసీ, నాన్ ఏసీ బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఏసీ బస్సులో గరుడ చార్జీ, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ చార్జీ వసూలు చేయనున్నారు.

ఈ ప్రత్యేక బస్సులు మియాపూర్-బొల్లారం క్రాస్‌రోడ్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. ఆ తర్వాత మధ్యలో ఎక్కడా ఆగకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ బస్సులకు కరెంట్ బుకింగ్ సదుపాయం ఉండదు.

రెండో దశలో బెంగళూరు, చెన్నైలలో చిక్కుకుపోయిన వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. బస్సులు నడిపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ ఇప్పటికే అన్ని జిల్లాల ఆర్టీసీ రీజనల్ మేనేజర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఇవి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Hyderabad
Ranga Reddy District
Andhra Pradesh
APS RTC

More Telugu News