Edgard Ziebat: 55 రోజులుగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో మగ్గిన జర్మన్ జాతీయుడు ఎట్టకేలకు ఆమ్ స్టర్ డామ్ పయనం

  • వియత్నాం నుంచి ఢిల్లీ వచ్చిన జర్మన్
  • టర్కీ వెళ్లేందుకు ప్రయత్నం
  • అప్పటికే విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్
  • దాంతో ఢిల్లీ ఎయిర్ పోర్టుకే పరిమితం
German national who stranded in Delhi airport left Amsterdam

లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో జర్మనీకి చెందిన ఎడ్గార్డ్ జీబాట్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 55 రోజుల పాటు ఒక్కడే మనుగడ సాగించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడతడు కేఎల్ఎమ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆమ్ స్టర్ డామ్ వెళ్లినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 40 ఏళ్ల ఎడ్గార్డ్ జీబాట్ మార్చి 18న వీయ్ జెట్ ఎయిర్ లైన్స్ విమానంలో వియత్నాం నుంచి ఢిల్లీ వచ్చాడు. వాస్తవానికి అతడు ఢిల్లీలో టర్కీ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే, అప్పటికే భారత్ ప్రయాణికుల విమానాలను రద్దు చేయడంతో జీబాట్ ఢిల్లీ ఎయిర్ పోర్టులోని అంతర్జాతీయ ట్రాన్సిట్ ఏరియాలో ఉండిపోవాల్సి వచ్చింది.

అతడికి నేర చరిత్ర ఉండడంతో జర్మనీ ఎంబసీ సాయం చేసేందుకు నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. దాంతో అనుమతులు వచ్చేవరకు ఆ వ్యక్తి ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే కాలం గడిపాడు. అతడికి ఢిల్లీ ఎయిర్ పోర్టు నిర్వహణ సంస్థ డీఐఏఎల్ ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులు, విశ్రమించేందుకు ఓ రిక్లైనర్ కుర్చీ అందించింది. పరిస్థితులు అనుకూలించడంతో అతడు కేఎల్ఎమ్ విమానంలో ఈ ఉదయం ఆమ్ స్టర్ డామ్ పయనమయ్యాడు. కాగా, విమానం ఎక్కే ముందే నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతడికి నెగెటివ్ వచ్చింది.

More Telugu News