America: సెల్ఫ్ క్వారంటైన్‌లోకి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్.. అలాంటిదేమీ లేదన్న ఆయన ప్రతినిధి!

  • తన సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్
  • వైద్యుల సూచన మేరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి మైక్ పెన్స్
  • కరోనా బారినపడిన, పడుతున్న కరోనా టాస్క్ ఫోర్స్
America vice president Mike pence in self quarantine

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో పెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆయనకు నిర్వహిస్తున్న పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వస్తున్నప్పటికీ, వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధానికే పెన్స్ మొగ్గు చూపారు.

మరోవైపు, కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు ఏర్పడిన బృందమే ఆ వైరస్ బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ బృందంలోని ఉన్నతస్థాయి శాస్త్రవేత్తలు ఇప్పటికే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అలాగే, ఈ బృందంలోని సభ్యులైన అలర్జీ, అంటువ్యాధుల నివారణ జాతీయ డైరెక్టర్ ఆంథోనీ ఫౌచీ, వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాల డైరెక్టర్ రెడ్‌ఫీల్డ్, ఆహార, ఔషధ పరిపాలన విభాగం కమిషనర్ స్టీఫెన్ హాన్‌లు కూడా నిర్బంధంలోనే ఉన్నారు.

అయితే, పెన్స్ సెల్ఫ్ క్వారంటైన్ వార్తలను వైట్‌హౌస్ ఖండించింది. అలాంటిదేమీ లేదని, ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. వైట్‌హౌస్ మెడికల్ యూనిట్ సలహాలను పెన్స్ పాటిస్తారని, అయితే సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్లే ఆలోచన లేదని పెన్స్ అధికార ప్రతినిధి డెవిన్ ఓ మెలీ పేర్కొన్నారు. ఆయనకు ప్రతి రోజూ నిర్వహిస్తున్న పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులే వస్తున్నాయని, ఆయన నేడు వైట్‌హౌస్‌కు హాజరవుతారని డెవిన్ వివరించారు.

More Telugu News