South Korea: లాక్‌డౌన్ ను సడలిస్తున్న దేశాలకు షాక్.. మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి

  • ఆంక్షల సడలింపుతో రోడ్లపైకి వస్తున్న జనం
  • తెరిచిన బార్లు, రెస్టారెంట్లను మూసేసిన దక్షిణాఫ్రికా
  • రష్యాలో విజృంభిస్తున్న మహమ్మారి
Lockdown Eases shocks in many countries

లాక్‌డౌన్ ను సడలిస్తున్న దేశాల్లో మహమ్మారి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సడలింపుతో ఊపిరి పీల్చుకుని రోడ్ల మీదకు వస్తున్న జనం కారణంగా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దక్షిణ కొరియాలో గత 24 గంటల్లో 34 మంది కరోనా బారినపడ్డారు. ఒకే రోజు ఇంతమంది వైరస్ బారినపడడం గత నెల రోజుల్లో ఇదే తొలిసారి. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వైరస్ తగ్గుముఖం పట్టింది. దీంతో ఆంక్షలను సడలించిన ప్రభుత్వం బార్లు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడీ నిర్ణయమే వైరస్ తిరిగి విజృంభించేందుకు కారణమైంది.

బార్లు, నైట్‌క్లబ్‌లలో జనం భౌతిక దూరాన్ని గాలికి వదిలేయడంతో వైరస్ తిరిగి సంక్రమిస్తోంది. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ఎక్కువ మంది ఇటువంటి కేంద్రాలను సందర్శించిన వారే కావడం గమనార్హం. వైరస్ మళ్లీ చెలరేగుతుండడంతో అప్రమత్తమైన ప్రభుత్వం 2,100 నైట్‌క్లబ్‌లు, బార్లు, డిస్కోలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

జర్మనీలోనూ కొత్తగా 667 కేసులు నమోదయ్యాయి. ఓ జంతువధ శాలలో 180 మంది కరోనా బారినపడ్డారు. మరోవైపు, నిబంధనలు సడలించాలంటూ రాష్ట్రాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో గత బుధవారం నిబంధనలు పాక్షికంగా సడలిస్తూ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నిర్ణయం తీసుకున్నారు. ఇంకోవైపు, ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో వేలాదిమంది రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

అమెరికా కూడా నెమ్మదిగా ఆంక్షలను సడలిస్తోంది. జార్జియా, టెక్సాస్, నెవడాల్లో మాల్స్ తెరుచుకుంటున్నాయి. న్యూయార్క్‌లో మరో నాలుగు రోజుల్లో నిషేధాజ్ఞలు ముగియనుండగా, వాటిని వచ్చే నెల 7 వరకు పొడిగించాలని గవర్నర్ ఆండ్రూ క్యూమో నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఫ్రాన్స్‌లో తాజాగా 80 మంది మరణించారు. గత నెల రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెయిన్‌లో కూడా నిన్న అతి తక్కువ మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 143 మంది మాత్రమే మరణించారు. దీంతో నిషేధాజ్ఞలను నేటి నుంచి సడలించాలని నిర్ణయించింది.

ఇక, రష్యాలో పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ 11,012 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. పాకిస్థాన్‌లో నిన్న 2,870 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 30 వేలు దాటగా, 639 మంది మరణించారు.  దక్షిణాఫ్రికాలో 9,400 కేసులు నమోదు కాగా, ఆఫ్రికా ఖండంలో మొత్తం కేసుల సంఖ్య 60 వేలు దాటింది.

More Telugu News