Road Accident: సైకిల్ పై 1000 కిలోమీటర్ల ప్రయాణం... మార్గమధ్యంలో అన్నం కోసం ఆగితే కారు ఢీకొని మృతి!

  • న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన అన్సారీ
  • 500 కిలోమీటర్ల ప్రయాణం తరువాత ప్రమాదం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Migrent Worker Killed in Accident in Meals Break

తన స్వగ్రామానికి చేరేందుకు 1000 కిలోమీటర్ల ప్రయాణాన్ని సైకిల్ పై ప్రారంభించిన ఓ యువకుడు, మార్గమధ్యంలో అన్నం తినేందుకు ఆగిన వేళ, ఓ కారు వచ్చి ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన లక్నోలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏడుగురు స్నేహితులతో కలిసి సగీర్ అన్సారీ (26) తన స్వస్థలమైన బీహార్ లోని తూర్పు చంపారన్ కు న్యూఢిల్లీ నుంచి ఈ నెల 5న ప్రయాణం ప్రారంభించాడు. ఐదు రోజుల్లోవారంతా  సగం దూరం ప్రయాణించారు. మార్గమధ్యంలో లక్నో శివార్లలో భోజనం కోసం ఆగారు. రోడ్డు విభాగిని (డివైడర్)పై కూర్చుని అన్నం తింటుండగా ఓ కారు అదుపుతప్పి వచ్చి ముందుగా అన్సారీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అన్సారీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డు విభాగినిపై ఉన్న ఓ చెట్టు కారుకు అడ్డుపడడం వల్ల మిగతా వారు బతికిపోయారు. బాధితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని వెల్లడించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News