Kannababu: ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చింది: మంత్రి కన్నబాబు

  • పరిశ్రమ వద్ద ప్రస్తుతం 82.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని వెల్లడి
  • ప్రజలు మరో 24 గంటలపాటు శిబిరాల్లోనే ఉండాలని సూచన
  • ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ కంపెనీ ప్రతినిధులకు ఆదేశాలు
AP Minister Kannababu says situation under control at LG Polymers

వైజాగ్ లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ గ్యాస్ లీక్ ఘటన, తదనంతర పరిణామాలపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద 82.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు మరో 24 గంటల పాటు శిబిరాల్లోనే ఉండాలని కోరుతున్నామని చెప్పారు. కేజీహెచ్ నుంచి డిశ్చార్జి అయిన వ్యక్తులు కూడా శిబిరాల్లోనే ఉండాలని సూచించారు. శిబిరాల్లో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

దక్షిణ కొరియాలోని కంపెనీ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారని, ఘటనపై నివేదిక ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించామని తెలిపారు. ప్రజలు, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆ నివేదికలో స్పష్టం చేయాలని కోరామని పేర్కొన్నారు. నిపుణులు పరిసర గ్రామాల్లోని నీరు, మట్టి ఇతర నమూనాలు పరీక్షిస్తున్నారని కన్నబాబు వెల్లడించారు. పరిశ్రమలో ట్యాంకుల స్థితి బాగుందని నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని చెప్పారు.

More Telugu News