Dr Zahid Adbul Majeed: కరోనా రోగిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన ఎయిమ్స్ వైద్యుడు!

  • ఢిల్లీలో ఘటన
  • కరోనా రోగికి ఆక్సిజన్ ట్యూబ్ అమర్చడంలో లోపం
  • శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడిన రోగి
  • ట్యూబు సరిగా కనిపించేందుకు రక్షక కళ్లజోడు తీసేసిన డాక్టర్
AIIMS doctor risks his own life to save corona patient

కరోనా వైరస్ భూతం కేవలం తాకినంతనే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా నివారణకు భౌతిక దూరాన్ని మించిన నివారణ చర్య లేదని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అయితే, ఢిల్లీలోని ఓ వైద్యుడు మాత్రం విషమ పరిస్థితిలో ఉన్న కరోనా రోగిని కాపాడేందుకు తన ముఖానికి ఉన్న రక్షణ కవచాన్ని కూడా తీసివేసి వైద్యం అందించిన ఘటన 'వైద్యో నారాయణ హరి' అనే సూక్తిని నిజం చేసింది.

ఢిల్లీకి చెందిన డాక్టర్ జాహిద్ అబ్దుల్ మజీద్ ఎయిమ్స్ లో అత్యవసర కేసుల నిపుణుడు. అయితే, కరోనా నిర్ధారణ అయిన ఓ మధ్యవయసు రోగిని ఎయిమ్స్ ప్రధాన ఆసుపత్రి నుంచి ట్రామా సెంటర్ కు తరలిస్తుండగా, ఆ రోగి ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఈ సమాచారం అందుకున్న డాక్టర్ మజీద్ అప్పటికి ఇంకా రంజాన్ ఉపవాసం ముగించకపోయినా వెంటనే విధులకు హాజరయ్యాడు. ఆ రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడం గమనించి, అతడికి అమర్చిన ట్యూబు సరిగా ఇమడలేదని గుర్తించాడు.

ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ రోగి ప్రాణం పోయే పరిస్థితి కావడంతో డాక్టర్ మజీద్ వెంటనే స్పందించాడు. ఆ ఆక్సిజన్ ట్యూబును సరైన విధంగా అమర్చేందుకు ప్రయత్నించాడు. అయితే కళ్లకు అడ్డుగా ఉన్న రక్షక కవచాలతో సరిగా దృష్టి ఆనడంలేదని తెలుసుకున్నాడు. రోగికి సరైన విధంగా ఆక్సిజన్ ట్యూబు అమర్చకపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించి తన ప్రాణాన్ని లెక్కచేయకుండా, కరోనా సోకుతుందన్న భయాన్ని వదిలేసి తన కళ్లకు ఉన్న రక్షణాత్మక కళ్లజోళ్లను తీసివేశాడు. వెంటనే ఆ ట్యూబును సరైన ప్లేసులో అమర్చడంతో ఆ రోగి సజావుగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు.

అయితే, ఎయిమ్స్ వైద్యాధికారులకు ఈ విషయం తెలియడంతో ముందు జాగ్రత్తగా డాక్టర్ మజీద్ కు 14 రోజుల క్వారంటైన్ విధించారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నానని, మరికొన్నిరోజుల తర్వాత టెస్టులు చేయించుకుని నెగెటివ్ వస్తే మళ్లీ విధుల్లో చేరతానని డాక్టర్ మజీద్ తెలిపాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోగిని ప్రాణాపాయ పరిస్థితుల నుంచి తప్పించాలనే ప్రయత్నించానని, అందుకే ఎంతో రిస్క్ తీసుకుని తన రక్షక కవచాలను కూడా తీసివేశానని వివరించాడు.

More Telugu News