Hero Motocorp: లాక్ డౌన్ సడలింపుల తర్వాత 10 వేలకు పైగా ద్విచక్రవాహనాలు విక్రయించిన హీరో మోటోకార్ప్

Hero Motocorp restart sales after lock down relaxations
  • లాక్ డౌన్ తో మార్చి 22 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన హీరో
  • ఇటీవల లాక్ డౌన్ సడలించిన కేంద్రం
  • మే 4 నుంచి హీరో తయారీ కేంద్రాల్లో కదలిక
కరోనా వైరస్ ధాటికి బాగా నష్టపోయిన రంగాల్లో ఆటోమొబైల్ రంగం కూడా ఉంది. ఆయా సంస్థలు తమ చరిత్రలోనే ఎన్నడూలేనంతగా అమ్మకాల క్షీణతను ఎదుర్కొన్నాయి.  ఏప్రిల్ మాసంలో ఒక్క యూనిట్ కూడా అమ్మలేని చెత్త రికార్డు మూటగట్టుకున్నాయి. అయితే, మే నెల మొదటివారంలో కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ప్రకటించడం ఆటోమొబైల్ రంగానికి కాస్తంత ఉత్సాహాన్నిచ్చింది. భారత్ లో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీదారు హీరో మోటోకార్ప్ కూడా విక్రయాలు షురూ చేసింది. మే 7 నుంచి ఇప్పటివరకు 10 వేల యూనిట్లకు పైగా విక్రయించింది.

లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆథరైజ్డ్ డీలర్లు, సర్వీస్ సెంటర్ల సహా 1500 విక్రయ కేంద్రాల ద్వారా రిటైల్ అమ్మకాలు సాగిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల దరిమిలా మార్చి 22 నుంచి హీరో మోటోకార్ప్ ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలు నిలిపివేసింది. తాజాగా కేంద్రం లాక్ డౌన్ మార్గదర్శకాలు సడలించడంతో మే 4 నుంచి ధరుహేరా, గుర్గావ్, హరిద్వార్ లో ఉన్న తన తయారీ కేంద్రాల్లో పనులు పునఃప్రారంభించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న తన డీలర్లు, సర్వీస్ సెంటర్లు, విడిభాగాల పంపిణీదారులకు పునఃప్రారంభానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.
Hero Motocorp
Sales
Two Wheelers
Lockdown
Corona Virus
India

More Telugu News