Mohammad Shami: చూడమ్మా, నేను నీ కెప్టెన్ని... నన్ను వెర్రిపప్పను చేయాలని చూడకు: షమీకి ధోనీ వార్నింగ్ ఇచ్చిన వేళ..!

  • 2014లో న్యూజిలాండ్ లో పర్యటించిన టీమిండియా
  • మెకల్లమ్ క్యాచ్ వదిలిన కోహ్లీ
  • ట్రిపుల్ సెంచరీ చేసిన మెకల్లమ్
  • సహనం కోల్పోయిన షమీ
Shami reveals how Dhoni reprimanded him in New Zealand

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన సారథ్యంలో ఎంతోమంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించేవాడన్నది అందరికీ తెలిసిందే. అయితే, మైదానంలో ఏదైనా తేడా వస్తే అంతే కఠినంగా వ్యవహరిస్తాడు. అందుకు ఈ ఘటనే నిదర్శనం.

తాజాగా, బెంగాల్ క్రికెటర్లు మహ్మద్ షమీ, మనోజ్ తివారీ సోషల్ మీడియా లైవ్ లో అభిమానుల కోసం లైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షమీ మాట్లాడుతూ, 2014 న్యూజిలాండ్ టూర్ లో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు. కివీస్ తో ఓ టెస్టు మ్యాచ్ లో గెలిచే స్థితిలో ఉండగా, బ్రెండన్ మెకల్లమ్ ఇచ్చిన క్యాచ్ ను విరాట్ కోహ్లీ జారవిడిచాడని, దాంతో మెకల్లమ్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేసి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడని షమీ తెలిపాడు. మెకల్లమ్ క్యాచ్ మాత్రమే కాకుండా, ఆ మ్యాచ్ లో పలు క్యాచ్ లను భారత ఆటగాళ్లు డ్రాప్ చేశారని వెల్లడించాడు.

లంచ్ కు ముందు కూడా తన బౌలింగ్ లో మరో క్యాచ్ వదలడంతో చివరి బంతిని బౌన్సర్ కి సంధించానని, అయితే ఆ బంతి కీపింగ్ చేస్తున్న ధోనీ తల పక్కనుంచి బౌండరీకి వెళ్లిందని వివరించాడు. ఇక, లంచ్ కోసం డ్రెస్సింగ్ రూమ్ కి వస్తుండగా ధోనీ వార్నింగ్ ఇచ్చినట్టు షమీ తెలిపాడు.

"ఫీల్డర్లు క్యాచ్ వదిలారు సరే, చివరి బంతిని నువ్వు సరిగా వేయాలి కదా అన్నాడు. దాంతో నేను, బంతి చేతిలోంచి జారిపోయింది అని చెప్పాను. ఆ మాటకు ధోనీ... చూడమ్మా, నేను నీ కెప్టెన్ని. నన్ను వెర్రిపప్పను చేయాలని చూడకు. నా కెరీర్ లో ఎంతోమంది ఆటగాళ్లు వచ్చారు, పోయారు. నాకు టోకరా వేస్తే ఎలా! అంటూ మందలించాడు" అని షమీ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు.

More Telugu News