Tamil Nadu: మద్యం అమ్ముకుంటామంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన తమిళనాడు ప్రభుత్వం

  • షాపుల్లో మద్యం అమ్మకాలపై మద్రాస్ హైకోర్టు నిషేధం
  • కావాలంటే ఆన్ లైన్లో అమ్ముకోవచ్చని సూచన
  • హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన తమిళనాడు
Tamil Nadu files petition in Supre Court over Madras High Court ban on liquor sales

లాక్ డౌన్ ఆంక్షలను స్వల్పంగా సడలించిన కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే, పలు చోట్ల మందుబాబులు సామాజిక దూరం పాటించకుండా లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మరోవైపు, కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, షాపుల ద్వారా మద్యం అమ్మకాలను ఆపేయాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. కావాలంటే... ఆన్ లైన్ ద్వారా మద్యాన్ని విక్రయించుకోవచ్చని సూచించింది. దీంతో, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్యం అమ్మకాలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News