ఈ ఏడాది చివరి వరకు గూగుల్, ఫేస్ బుక్ ఉద్యోగులలో చాలామందికి ఇంటి నుంచే పని!

08-05-2020 Fri 18:59
  • కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితులు
  • ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరుతున్న సంస్థలు
  • ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఉండవని భావిస్తున్న గూగుల్, ఫేస్ బుక్
Google and Facebook may encourage their employees to work from home till year end

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేక పరిణామాలకు కారణమైంది. దిగ్గజ సంస్థలు సైతం తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరాల్సి వచ్చింది. టెక్ దిగ్గజాలుగా పేరొందిన గూగుల్, ఫేస్ బుక్ సైతం అదే బాటలో నడుస్తున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న తీరును గమనిస్తున్న గూగుల్, ఫేస్ బుక్ ఈ ఏడాది చివరి వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నాయి. అందుకే తమ ఉద్యోగులలో చాలా మందిని డిసెంబరు వరకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పించాయి.

ఫేస్ బుక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఆఫీసులను మూసేసింది. జూలై 6 నాటికి కూడా ఫేస్ బుక్ కార్యాలయాలు తెరుచుకోవడం కష్టమేననిపిస్తోంది. దాంతో ఈ సంవత్సరం మొత్తం ఇంటి నుంచే పని చేసుకోవచ్చంటూ ఉద్యోగులకు సూచించామని ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. గూగుల్ పరిస్థితి కూడా అందుకు భిన్నం కాదు.

ఇటీవలే జరిగిన సంస్థాగత సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదే తరహాలో స్పందించారు. ఈ ఏడాదిలో మిగిలిన భాగం అంతా ఇంటి నుంచి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు, గూగుల్ మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా గూగుల్ ఉద్యోగులకు వేతనంలో భాగంగా అనేక ప్రోత్సాహకాలు ఉంటాయి. అయితే, ఇంటి నుంచి పనిచేసే కాలంలో ఈ ప్రోత్సాహకాలను నిలిపివేయాలని సంస్థ నిర్ణయించినట్టు సమాచారం.