Gujarath: కరోనా వ్యాప్తికి, ‘నమస్తే ట్రంప్’కు ముడిపెడుతూ బీజేపీపై విరుచుకుపడ్డ గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్

  • ‘నమస్తే ట్రంప్’ వల్లే గుజరాత్ లో కరోనా వ్యాపించింది
  • ఇందులో బీజేపీ పాత్రపై సిట్ తో దర్యాప్తు జరపాలి  
  • బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయిస్తాం
  • గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్దా
Gujarat congress pcc severe comments on BJP

గుజరాత్ లో ‘కరోనా’ వ్యాప్తికి, దాదాపు మూడు నెలల క్రితం ఆ రాష్ట్రంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి లంకె పెడుతూ కాంగ్రెస్ పార్టీ  తీవ్ర ఆరోపణలు చేసింది. అహ్మదాబాద్ లోని మొతారా స్టేడియంలో  నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’కు లక్షకు పైగా ప్రజలు హాజరైన విషయాన్ని గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు అమిత్ చావ్దా ప్రస్తావించారు.

ఈ కార్యక్రమం నిర్వహించడం వల్లే గుజరాత్ లో కరోనా వ్యాపించిందని, రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చేయడంలో బీజేపీ పాత్రపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) తో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ గుజరాత్ హైకోర్టును త్వరలోనే ఆశ్రయిస్తామని వెల్లడించారు. కరోనా ప్రభావిత నగరాల్లో అహ్మదాబాద్ ఒకటిగా మారిందని, ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం వల్ల కేవలం గుజరాత్ మాత్రమే కాదు, యావత్తు దేశం ఇందుకు మూల్యం చెల్లిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ ఖండించింది. కొవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించకముందే ‘నమస్తే ట్రంప్’ నిర్వహించామని, ఈ కార్యక్రమం జరిగిన నెల రోజుల తర్వాత గుజరాత్ లో తొలి కరోనా కేసు నమోదైందని గుర్తుచేశారు.

More Telugu News