AIIMS: జూన్, జూలైలో కరోనా పతాకస్థాయికి చేరే అవకాశాలున్నాయి: ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరిక

  • భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు
  • కొన్నిరోజులుగా నిత్యం 3 వేలకు పైగా కొత్త కేసులు
  •  వివిధ అంశాలు ప్రభావం చూపొచ్చన్న ఎయిమ్స్ డైరెక్టర్
AIIMS Director tells corona get into peaks in June and July

గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా ఆందోళన కలగకమానదు. రెండు వారాల కిందటి వరకు రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు రోజుకు 3 వేల కేసుల వరకు బయటపడుతున్నాయి. ఈ పరిణామాలపై ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. జూన్, జూలై మాసాల్లో దేశంలో కరోనా పతాకస్థాయికి చేరే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న అంచనాలు, సమాచారం, పెరుగుతున్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతుందని అన్నారు.

అయితే, ఈ పెరుగుదలపై వివిధ అంశాలు ప్రభావం చూపే అవకాశముందని, అవి ఎంతమేర ప్రభావం చూపిస్తాయన్నది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. లాక్ డౌన్ పొడిగింపు ప్రభావం ఎంతనేది కూడా మరికొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేమని వివరించారు. భారత్ లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 52 వేలు దాటింది. దేశవ్యాప్తంగా 1,783 మరణాలు సంభవించాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 35,902 కాగా, 15,266 మంది డిశ్చార్జి అయ్యారు.

More Telugu News